బూర్గుల రామకృష్ణారావు తర్వాత.. ఇన్నాళ్లకు మళ్లీ : సీఎం రేవంత్

రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రైతు పండుగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతుల కోసం ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. నవంబరు 29కి ఎంతో ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ప్రజాప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లు వేశారు. నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు ముంబయి, హైదరాబాద్‌కు వలస పోయాయి. బూర్గుల రామకృష్ణరావు తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారు.
గత ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేసిందా? వరి వేస్తే ఉరి వేసుకున్నట్లు అని గత సీఎం అనలేదా? ఈ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే రూ. 500 బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చింది. గత ప్రభుత్వం రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టింది. మూడేళ్లు నిండకుండానే ఆ ప్రాజెక్టు కూలింది. ఈ ఏడాది రాష్ట్రంలో రూ.1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిరది. గత ప్రభుత్వం వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది. ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం ఇది. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఇంత రుణమాఫీ చేశారా? అని ప్రధాని మోదీ, కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నా. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.