మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే
మునుగోడు నియోజకవర్గంలోని చండూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రాజకీయ కక్షతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దుండగులు దగ్ధం చేశారని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, కార్యాలయాలు తగులబెట్టినా మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో మా గెలుపును ఆపలేరు అని అన్నారు.
టీఆర్ఎస్, బీజేపీలకు వెన్నులో వణుకు పుట్టింది. కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే కార్యాలయాలపైన దాడులు చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై మా కేడర్‌ను బెదిరించేందుకు కుట్ర చేస్తున్నారు. బెదిరిస్తే మేం బెదిరిపోం. కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసిన వాళ్లను 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. లేదంటే ఎస్పీ కార్యాలయం ముందు నేనే ధర్నా చేస్తా. ఈ ఘటనను నిరసిస్తూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం అని తెలిపారు.













