7న తెలంగాణ పీసీసీ చీఫ్ గా…. బాధ్యతల స్వీకరణ

కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్నాళ్లూ కష్టాలు పడ్డారని, ఇప్పుడు ఆ కష్టాన్ని తిరుగుబాటుగా మార్చాలని తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వారికి తాను అండగా ఉంటానన్నారు. టీపీసీసీ చీఫ్‍గా జులై 7న బాధ్యతలు స్వీకరిస్తామని తెలిపారు. సంస్థాగతంగా టీఆర్‍ఎస్ కంటే కూడా కాంగ్రెస్ బలమైనదని, త్వరితగతిన పుంజుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గత కలహాలు నెట్ ప్రాకీస్టు లాంటివని, ప్రత్యర్థిపై ఆటలో అందరం కలిసే పోరాడతామని అన్నారు. పార్టీగా సమష్టి నిర్ణయాలే తీసుకుంటామని, వ్యక్తిగత నిర్ణయాలు ఉండబోనని అన్నారు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని, ఎప్పుడున్నది పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపారు.
ప్రస్తుత రాజకీయాలకు ఎన్టీఆర్, వైఎస్‍ఆర్‍లు అతీతులని, వారిని విమర్శించడం వికృతమైన చర్య అని అన్నారు. వైఎస్‍ఆర్ చివరి నిమిషం వరకూ కాంగ్రెస్‍వాదిగానే ఉన్నారని, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం బలం ఎంతో బీజేపీ బలం కూడా అంతేనని అన్నారు. అయోధ్య భూములు వ్యవహారంలో రాముడినీ బీజేపీ వాళ్లు తెగనమ్ముకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇప్పుడు గడ్డం పెంచి సన్యాసి అవతారమెత్తారని వ్యాఖ్యానించారు.