ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని… నిర్ఘాంతపోయేలా చేసింది
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ భూతంతో తొలి మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మత్తు మందులకు బానిసై 23 సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యార్థి మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని నిర్ఘాంతపోయేలా చేసిందని అన్నారు. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ డ్రగ్స్ వినియోగ కేంద్రంగా మారుతోందని గడిచిన ఐదేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ కారిడార్ ఏర్పాటు జరిగిందేమో అన్న కొత్త సందేహాలు వస్తున్నాయి. డ్రగ్స్ భూతం ఏదో ఒక రూపంలో పడగ విప్పినప్పుడల్లా అందులో ప్రమేయం ఉన్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎన్ని టాస్క్ ఫోర్స్‌లు వేసినా, ప్రత్యేక అధికారులతో పర్యవేక్షించినా డ్రగ్స్ మాఫియా అంతం కావడం లేదు అన్నారు.













