రేవంత్ బాంబు
-తెలుగు దేశం ఆవరణ లో పేలిన రేవంత్ బాబు, ఎంతమందికి గాయాలు ఎంతనష్టం ఇంకా లెక్కల్లోకి రాని వైనం
టిటిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి దీపావళి ‘ధమాకా’ అయ్యారు. ఏపీకి చెందిన మంత్రులు, టిడిపి నాయకులకు, తెలంగాణ సిఎం కెసిఆర్‌కు మధ్య క్విడ్‌ప్రోకో లావాదేవీలున్నాయని ‘బాంబు’ పేల్చి పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టిడిపి ముఖ్య నేతలకు నిద్ర లేకుండా చేశారు. రేవంత్ తిరుగుబాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కలకలం రేపగా, యావత్ టిడిపి కుడితిలోపడ్డ బల్లిలా గిలగిల్లాడి పోతున్నది. మీడియా ముందుకొచ్చి ధిక్కారస్వరం వినిపిస్తున్నదీ, ఏపిలో అధికారపార్టీ నేతలపై, మంత్రులపై ఆరోపణలు చేస్తున్నదీ సాదాసీదా నాయకుడైతే పెద్దగా ప్రాధాన్యముండేది కాదు. టిడిపి అధిష్టానం సైతం ఎలాగొలా నెట్టుకొచ్చేదే. తెలంగాణాలో 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేస్తూ రూ.50 లక్షలతో సహా రేేవంత్‌రెడ్డి వీడియో టేపుల సాక్షిగా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కు అడ్డంగా దొరికి అరెస్టు కాబడి నెల రోజులు జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటికొచ్చారు. ఆ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు.
ఇదిలా ఉండగానే ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై విచారించాలని వైసిపి ఎమ్మెల్యే ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా చంద్రబాబుకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. టిడిపి అధినేత చంద్రబాబుకు, రేవంతర్రెడ్డికి మధ్య ఇంతటి ‘అవినాభావ’ సంబంధం ఉన్నందునే రేవంత్ తీవ్రమైన ఆరోపణలు చేసినా టిడిపి నేతలు తేలు కుట్టిన దొంగల్లా కుక్కిన పేనులకు మాదిరి గమ్మునున్నారు. లేకపోతే ఈపాటికి ఇల్లెక్కి చిందులేసేవారే. తమ అధినేత ఆదేశాలతోనే రేవంత్ విషయంలో వ్యూహాత్మకంగా నాయకులు మసలుకొంటున్నట్లు వారి వ్యవహారశైలి తెలుపుతోంది.
రేవంత్ ఆరోపణలపై అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం హడావిడిగా హైదరాబాద్‌లో టిటిడిపి సమావేశం జరగ్గా అందులోనూ రేవంత్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన్ని సమావేశంలోకి ఎందుకు రానిచ్చారో తెలీదు. దీన్నిబట్టే రేవంత్ విషయంలో ఆకుకు అందకుండా పోకకు పొక్కకుండా ఉండాలని ‘పై’నుంచి ఆదేశాలున్నట్లు అర్థమవుతుంది. లోకేష్ హుటాహుటిన హైదరాబాద్‌కు చేరి మంత్రాంగం నడిపేదీ అందుకే.
రేవంత్ పార్టీ మారడం, అధిష్టానంపై అసంతృప్తి, ఎన్నికల పొత్తులు, ఏపీలో కెసిఆర్‌కు రాచమర్యాదలపై అభ్యంతరం వంటివి టిడిపి అంతర్గత వ్యవహారాలనుకోవచ్చు. కానీ ఏపి మంత్రులు, టిడిపి నాయకులపై రేవంత్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడటానికి సంబంధించినవి. అంతకు మించి క్విడ్‌ప్రోకోను స్థిరపరిచేవి. ఏపి మంత్రుల్లో సీనియర్, చంద్రబాబు తర్వాత నెంబర్ 2గా చెప్పుకునే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబ సభ్యులకు తెలంగాణాలో కెసిఆర్ రూ. రెండు వేల కోట్ల కాంట్రాక్టులిచ్చారంటున్నారు రేవంత్. ఆయన ఆ ఆరోపణ చేసి రెండు రోజులవుతున్నా ఇటు యనమల కానీ అటు కెసిఆర్ కానీ స్పందించలేదు. మరో ఏపి టిడిపి నేత పయ్యావుల కేశవ్ అల్లుడు, మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం భాగస్వామ్యం కలిగిన బీర్ల కంపెనీకి హైదరాబాద్‌లో కెసిఆర్ సర్కారు లైసెన్స్ ఇచ్చింది క్విడ్‌ప్రోకో వల్లనేన్నది రేవంత్ మరో సంచలన ఆరోపణ. దీనిపైనా ఆ ఇద్దరు నేతలదీ, టిఆర్ఎస్ ప్రభుత్వానిదీ మూగనోమే. రేవంత్ చేసిన రెండు ప్రధాన ఆరోపణలపై టిఆర్ఎస్, టిడిపి ఇరు పక్షాలూ కూడబలుక్కొని నిశ్శబ్ధం పాటిస్తున్నాయి. మౌనాన్ని అంగీకారమనుకోవచ్చా?
చంద్రబాబు, కెసిఆర్ ఇరువురూ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ తమ తమ రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నారని కొంత కాలంగా వస్తున్న ఆరోపణలు రేవంత్ రూపంలో బహిర్గతమయ్యాయి. ఓటుకు నోటు కేసు నమోదైన కొత్తల్లో చంద్రబాబును బ్రహ్మ దేముడు కూడా రక్షించలేడని కెసిఆర్ చేసిన శపథం ఏమైందో తెలీదు. తన ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేసిందని, రాజ్యంగ విరుద్ధమని, టిఆర్ఎస్ సర్కారును బోనెక్కిస్తామని చంద్రబాబు పలికినవి ప్రగల్భాలేనని తేలిపోయింది. విభజన చట్టంలో పొందు పర్చిన హామీలపైనా, నదీ జలాలు, ఉమ్మడి ఆస్తులు, ఉద్యోగుల పంపకాలు వగైరాలు ఇంకా కొలిక్కి రాకపోవడానికి రెండు ప్రభుత్వాలూ ప్రజా ప్రజాయోజనాలకు పాతరేసిన ఫలితమే.
భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ఏపూటకాపూట పొద్దుపుచ్చడం ఒకరికొకరు అంటకాగడం ఇరువురికీ అలవాటై పోయింది. అందుకే తెలంగాణాలో టిఆర్ఎస్ ప్రజా విధానాలపై పోరాడాల్సిన టిడిపి మెత్తబడింది. ఏపీకి అన్యాయం జరుగుతున్న పలు అంశాలపై టిడిపి సర్కారు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పెద్దన్న పాత్ర పోషిస్తోంది. చాలా విషయాలు బయట పెడతానని, సంగతి తేలుస్తానని రేవంత్ అంటున్నారు. అదే జరిగితే బాబు, కెసిఆర్ నాటకాలు, క్విడ్‌ప్రోకో లావాదేవీలు కొన్నైనా ప్రజలకు తెలిసొస్తాయి. చివరికి రేవంత్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.













