నల్లగొండ బరిలో రేవంత్?
నల్గొండ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చి పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కొండగల్ ఎమ్మెల్యేగా ఉన్నానని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించారు. పార్టీ బలహీన పడిందనే భావంతో కొత్తగా రైతు సమితులు ఏర్పాటు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని పదేపదే ప్రకటించే కేసీఆర్ కొత్త తరహా ఆఆలోచనకు తెరలేపారన్నారు.
రైతు సమితులను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ భర్త, టీఆర్ఎస్ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి హైకోర్టులో కేసు వేశారన్నారు. వాళ్ల తరపున వాదించే న్యాయవాది తరసాని సత్యంరెడ్డి కూడా 2001లో నుంచి టీఆర్ఎస్ న్యాయ సలహాదారుగా కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తేనన్నారు. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాన్ని వారు ఎలా ధిక్కరిస్తారని, ఒక వేళ ధిక్కరిస్తే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ తెరవెనక తతంగం నడిపిస్తూ సొంత పార్టీ నాయకులతోనే కోర్టులో కేసు వేయించి ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని ఆరోపించారు.













