ఈ వయసులో జంపింగా? సిగ్గుండాలి!
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వయస్సులో పార్టీ మారడానికి సిగ్గుండాలి అంటూ వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ వీడిన నేతలు డి.శ్రీనివాస్, కేశవరావు, బొత్స సత్యనారాయణ పేర్లను గుర్తుచేస్తూ, వెళ్ల వారు వెళ్తూనే ఉంటారని, అలాంటివారు ఏదైనా చెబుతారని అన్నారు. 40 ఏళ్లు పదువులు అనుభవించి చచ్చే ముందు పార్టీ మారడానికి సిగ్గుండాలి. పీసీసీ అధ్యక్షుడిగా ఓసారి, ఆ తర్వాత మరోసారి టికెట్ ఇస్తే ఓడిపోయారు. పొన్నాల లక్ష్మయ్యను ఎవరైనా గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలోకి పోవడానికి ఏం రోగం? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 81 ఏళ్ల వయస్సులో పార్టీ మారడమే బుద్ధి లేని పని, ఇంకా కుర్చీ పట్టుకుని వేలాడుతూ టికెట్ కావాలని తిరుగుతున్నారని మండిపడ్డారు. అభ్యర్థుల ఎంపిక కోసం తాము పంపిన పేర్లలో రెండు పేర్లు పంపామని, వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని, కానీ అప్పుడే పార్టీకి రాజీనామా ఎందుకు చేశారో చెప్పాలని అన్నారు. ఆయన ఏపార్టీలో చేరతారో తనకు తెలియదని, కానీ పార్టీని ఈ సందర్భంలో వీడివెళ్లడమే అతి పెద్ద నేరం అని దుయ్యబట్టారు.













