రాహుల్ అర్హత గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది?
ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు ఓ సైకో మంత్రి ప్రయత్నం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదనడం బీఆర్ఎస్ అవివేకమని అన్నారు. మీలా అవినీతి కుటుంబం కాదు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రధాని పదవినే త్యాగం చేసింది. రాహుల్ కంటే ఇంకెవరికైనా తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా? అసలు రాహుల్ అర్హత గురించి మాట్లాడే అర్హత మీకు ఎడ్కడిది? అని మండిపడ్డారు. ఉపాధిహామీ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆర్టీఐ, ఆహార భద్రత చట్టంతోపాటు హైదరాబాద్‌లో ఐటీ సంస్థలు, ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు, ఫార్మా సంస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరంగా పేరు మార్చారని విమర్శించారు. రీ డిజైన్ తర్వాత ఆయుకట్టు ప్రాంతం పెరగకపోగా, ఆ ప్రాజెక్టు రాష్ట్ర వనరులను కరిగిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు. ఎంత ఖర్చు పెట్టినా దానికి సరిపోవడం లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. ఈ రిపోర్టుపై చర్చించేందుకు కాంగ్రెస్ నుంచి ఇద్దరం వస్తాం. బీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, కేటీఆర్ సిద్దమా? అని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని విమర్శించారు. 2014 జూన్ 2 నాటికి కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని? 2023 జులై 2 నాటికి వారి ఆస్తులు ఎంతకు పెరిగాయో చర్చించేందుకు వారిద్దరూ సిద్దంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.













