ఒకసారి అమ్ముడుపోయిన వాళ్లు.. మరోసారి అమ్ముడుపోలేరా?
బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై అధికారులను ఉపయోగించుకొని కేసులు నమోదు చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గాంధీ భవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఈ రెండు పార్టీల గురించి చర్చించుకోవాలనే వ్యూహాత్మక కుట్రలో భాగంగానే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో కేసీఆర్ వైఖరి హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే అమ్ముడు పోయిన ఎమ్మెల్యేల మాటలు విని సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఎలా వచ్చారో ప్రతి ఒక్కరికీ తెలుసు అని అన్నారు.
ఒకసారి అమ్ముడుపోయిన వాళ్లు మరోసారి అమ్ముడుపోలేరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యహారంలో బీజేపీకి సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లింది. బీజేపీలోకి రావాలని అడిగారని ఎమ్మెల్సీ కవిత అంగీకరించారు. ఈ ఘటనలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్లను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నమోదు చేసుకోవాలి. కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చాలి. కవిత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా సిట్ అధికారి సీవీ ఆనంద్ దర్యాప్తు చేయాలి. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేయలాలన్నారు.













