విమర్శలు చేయడమే కాదు… అవకాశం వస్తే పాలించడమూ వచ్చు
తనకు విమర్శలు చేయడమే కాదు.. అవకాశం వస్తే పాలించడమూ వచ్చని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అజెండానే ప్రజల అజెండాగా కేసీఆర్ భ్రమలు కల్పించారని, అన్ని వర్గాలను మభ్యపెట్టి తన వైపునకు తిప్పుకున్నారని విమర్శించారు. తన మనుగడ కోసం నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాన్ని టీఆర్ఎస్ విస్తరింప జేసుకుందన్నారు. ఓ సమయంలో తన కుమార్తె నిశ్చితార్థానికి తాను హాజరు కాకుండా అడ్డుకోవాలని చూశారని, అదేం రాక్షస ఆనందం అని ప్రశ్నించారు. అలాంటి కేసీఆర్‌పై పోరాడే అవకాశం కాంగ్రెస్ పార్టీ తనకు కల్పించిందన్నారు. మావోయిస్టుల అజెండాలనే తన అజెండాగా చెప్పుకునే కేసీఆర్, కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని అనుకోవడం కూడా ఆ ఆజెండాలో ఉందా అన్ని ప్రశ్నించారు.













