ఆస్పత్రికి వెళ్లి మరీ వీహెచ్ ను కలుసుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వరుసగా సీనియర్లతో భేటీ అవుతున్నారు. అధిష్ఠానం రేవంత్ పేరును ప్రకటించగానే సీనియర్లైన షబ్బీర్ అలీ, జానారెడ్డిలను కలుసుకున్నారు. తాజాగా మరో ఇద్దరు సీనియర్లను రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఆయన నివాసంలో రేవంత్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తదనంతరం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత వీ. హనుమంతరావుతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడి రేసులో రేవంత్ పేరు వచ్చినప్పటి నుంచీ వీహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రేవంత్‌పై విమర్శలకు దిగుతూనే ఉన్నారు. సీనియర్ నేత వీహెచ్‌తో భేటీ అయిన తర్వాత రేవంత్ మాట్లాడుతూ… వీహెచ్ సలహాలు, సూచనలు తీసుకొని, ముందుకు వెళ్తానని ప్రకటించారు. వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి, ఆస్పత్రికి వచ్చానని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. దళితులు, ప్రజల విషయంలో వీహెచ్ చాలా సిన్సియర్‌గా ఉన్నారని, వాటి గురించే ఆలోచిస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు.