ఆరు గ్యారంటీలు అమలు చేసే బాధ్యత కలెక్టర్లదే : సీఎం రేవంత్

ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లేదనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లేనని సీఎం వ్యాఖ్యానించారు. జిల్లా స్థాయిలో అధికారుల నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనం కలిగేలా, మానవీయ కోణంలో ఉండాలని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమై ప్రజలకు సరైన సేవలు అందించాలని సూచించారు. శంకరన్, శ్రీధరన్‌లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలన్నారు.
పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని, సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలలో తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని, విద్యార్థిపై నెలకు రూ.85 వేలు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల పర్యవేక్షణపై కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే, విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందిస్తున్నారని, కలెక్టర్లు బదిలీ అయినప్పుడు కూడా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితీరు చూపాలని అన్నారు.