కంటోన్మెంట్ ఆదాయాన్ని కేసీఆర్ సర్కారు దోచేస్తోంది: రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆదాయాన్ని కేసీఆర్ సర్కారు దోచేస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం నాడు కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన.. బోర్డు సమావేశంలో వివిధ అంశాలపై చర్చలు జరిపినట్లు చెప్పారు. కంటోన్మెంట్ నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం అని రేవంత్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్‌కు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమయానికి విడుదల చేయడం లేదని విమర్శించారు. ఈ కారణంగా ఇక్కడ అభివృద్ధి మందగిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. కంటోన్మెంట్‌కు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా విడుదలయ్యేలా కిషన్ రెడ్డి కూడా చొరవ చూపాలని చెప్పారు. కంటోన్మెంట్ పరిధిలో ప్రజలకు ఎదురవుతున్న పలు సమస్యల గురించి కూడా తాము చర్చించినట్లు రేవంత్ వెల్లడించారు. రోడ్లు, నాలాలు, సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు గురించి మాట్లాడినట్లు తెలియజేశారు. అలాగే మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే సాయన్న విగ్రహాలను కంటోన్మెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు.













