అలాంటి వారికి ఓట్లు వేయొద్దు : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడులో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేస్తే ఎక్కడైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే దాన్ని ఆయన రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓటేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో 97వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ అస్తి అని అన్నారు. అందరం కలిసి పనిచేస్తే ఎవర్నైనా పడగొట్టచ్చని తెలిపారు. మండల స్థాయి నాయకులు రోజుకు రెండు గంటల సమయం కేటాయిస్తే విజయం కాంగ్రెస్‌దేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్ని అవకాశాలూ కల్పిస్తూ ఆయన వేరే పార్టీకి అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. అపారమైన అనుభవం కలిగిన జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్‌రెడ్డి సలహాతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్ర విలీన కార్యక్రమాలను స్వాతంత్య్ర ఉత్సవాలతో సమానంగా నిర్వహించాలని అన్నారు. సాయుధ పోరాటంలో నల్గొండకు చెందిన అనేక మంది సమిధులయ్యారని గుర్తు చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి 2023 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని, ఇందుకోసం రూ.5 వేల కోట్లు కేంద్రం కేటాయించాలన్నారు. గడిచిన 8 ఏళ్లుగా సెప్టెంబర్ 17ను ఎందకు నిర్వహించలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.













