ఆ నలుగురు సత్యహరిశ్చంద్రుడి వారసులు.. బీజేపీ, టీఆర్ఎస్లపై రేవంత్ ఫైర్
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై మరోసారి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మౌనంగా ఉన్న రేవంత్ మళ్లీ తెరపైకి వచ్చి టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండు పార్టీలు కలిసే ఎమ్మెల్యేల కొనుగోలు నాటకం ఆడుతున్నాయని, తమను ప్రలోభపెట్టారని చెబుతున్న ఎమ్మెల్యేలు నలుగురు సత్యహరిశ్చంద్రుడి వారసులంటూ ఎద్దేవా చేశారు. అన్ని చోట్లా కెమెరాలు పెట్టి ప్రలోభ పెట్టిన వారిని పట్టించాలని కేసీఆర్ చెప్పరని, వాళ్లు పట్టించారంటూ చురకలంటించారు. ఆ నేతలను మునుగోడు తీసుకెళ్లి జాతిరత్నాలు, ప్రజాస్వామ్య రక్షకులు, గొప్ప నేతలు అని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని, అది విని కేసీఆర్కు మతిస్థిమితం తప్పిందేమో అన్న సందేహాలు వస్తున్నాయని విమర్శించారు. ‘కేసీఆర్.. ఈ జాతిరత్నాలు ఎక్కడివి.. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావ్? కాంగ్రెస్లో గెలిచి అమ్ముడు పోయారు వాళ్లు. ఒకసారి అమ్ముడుపోయిన వాళ్లు అలాగే ఉంటారా? వాళ్లని నమ్ముకుని, వాళ్లను జాతిరత్నాలు చెప్పుకుంటూ నువ్వు రాజకీయాలు చేస్తున్నావా? కేసీఆర్ ఇంత దిగజారిపోయారా అనిపిస్తోంది’ అంటూ విమర్శలు గుప్పించారు.













