అక్కడ నన్ను ఎదిరించేవారు లేరు
మర్రి శశిధర్‌రెడ్డి చాలా ఓపికతో ఉండే వ్యక్తి అని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆయనకు ఏదో మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డే సర్దుకోవాలని సూచించారు. అన్ని పార్టీల్లో మనస్పర్థలు ఉంటాయని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని పేర్కొన్నారు. ఎవరైనా అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెలుసన్నారు. ఖమ్మంలో తనను ఎదురించే మొనగాడు ఎవరూ లేరన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లడం బాధాకరమని, మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్‌లో పరిణామాలు సహజమని, కొత్తేం కాదని తెలిపారు. బీజేపీలో కూడా చాలా సమస్యలు, నేతల మద్య విభేదాలు ఉన్నాయన్నారు. నితిన్ గడ్కరీ లాంటి వాళ్లనే బీజేపీ పక్కన పెట్టిందని ప్రస్తావించారు. పార్టీలో సీనియర్లను అవమానించే శక్తిమాన్ ఎవరూ లేరని స్పష్టం చేశారు.













