ఇదేనా బంగారు తెలంగాణ అంటే? : రేణుకా చౌదరి
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్ర్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలే కాదు, పసి పిల్లలు కూడా సురక్షితంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 418 మంది ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు జరిగినట్లు పోలీసు నివేదికలే చెబుతున్నాయన్నారు. అత్యాచార బాధితులకు ఎలా న్యాయం చేస్తారని ఆమె ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో వీడియో బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా నేరస్థుడేనని అన్నారు. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే ఈ కేసును నీరుగారుస్తున్నారు. జూబ్లీహిల్స్ మైనర్ కేసును వదిలేది లేదు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు. షీ టీమ్స్ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.













