మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శ్రీనివాస్‌గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల ఆఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వర్గాల తరపున వాదనలు విన్న ధర్మాసనం తాజాగా పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.













