తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఐ వివాహ సంబంధ మోసాలు అధికం : రేఖాశర్మ
తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఐ వివాహ సంబంధ మోసాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ సంబంధ మోసాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను నియంత్రించడం, చట్టపరంగా చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిచేందుకు బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన సదస్సుకు ఆమె హాజరయ్యారు. తెలంగాణ మహిళా భద్రత విభాగం ఎన్ఆర్ఐ సెల్ పనితీరుపై రూపొందించిన పుస్తకాన్ని రేశాశర్మ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జాతీయ మహిళా కమిషన్, తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం కల్పించడంతోనే ఈ తరహా మోసాలను అరికట్టే అవకాశముందన్నారు. ఎన్ఆర్ఐ వివాహ సంబంధ మోసాలపై జాతీయ మహిళా కమిషన్లో 5,858 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ తరహా కేసుల్లో విదేశీ ఎంబసీలు చొరవ తీసుకొని బాధితురాళ్లకు న్యాయం చేసే విషయంపై ఆలోచన చేయాలని కోరారు. ఇలాంటి కేసుల్లో బాధితురాళ్లకు సహకరించే విషయంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారు.
తెలంగాణ మహిళా కమిషన్కు ఈ మోసాలపై అందిన ఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 728 కేసులు నమోదు కాగా గ్రామీణ ఠాణాల్లోనే 678 కేసులున్నాయని మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తెలిపారు. ఒక్కో కేసుకు ప్రత్యేక అధికారిని నియమించి విదేశీ ఎంబసీలు, ఏజెన్సీలతో సమన్వయం చేయిస్తున్నామని డీఐజీ సుమతి తెలిపారు.













