హెల్త్ డైరెక్టర్ సంచలన ప్రకటన… కేసీఆర్ ఆదేశిస్తే
తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను రాజకీయ రంగప్రవేశం చేస్తానని, సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని అన్నారు. డాక్టర్ బీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుల ఆత్మీయ సమావేశానికి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తే పోటీ చేయడం ఖాయమని, ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఉద్దేశం మాత్రం లేదని అన్నారు. రానున్న రోజుల్లో డాక్టర్ బీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 5 నుంచి గడప గడపకూ గడల కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమం నుంచే ప్రజల్లోకి వెళతామని ప్రకటించారు.













