పొత్తులపై చంద్రబాబుదే తుది నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేక్ వ్యూగెస్ట్ హౌజ్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలకు తాము సిద్ధమని అన్నారు. తెలంగాణలో ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులను టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. టీడీపీపై కేసీఆర్ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణలో టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించామని తెలిపారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు పేర్కొన్నారు. పొత్తుల విషయంలో ఆయా పార్టీల అభిప్రాయాలను టీడీపీ అధినేతకు తాము వివరించామని, పొత్తుల విషయమై తుది నిర్ణయం చంద్రబాబు తీసుకుంటారని రావుల సృష్టం చేశారు.













