అంగరంగ వైభవంగా రామలింగేశ్వరుని కల్యాణోత్సవం
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ తెల్లవారుజామున శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి సందర్భంగా వేడుకను కనుల పండువగా నిర్వహించారు. దేవేరితో కలిసి నంది వాహనరూడుడైన స్వామివార్లను ఆలయ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అర్చకులు కల్యాణ క్రతువును మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా చేశారు.
రథసప్తమి నాడు చెరువుగట్టు ఆలయాన్ని సందర్శించుకుంటే సూర్యభగవానుణ్ని దర్శించుకున్న ఫలం దక్కుతుందన్నది భక్తుల నమ్మం. దీంతో రామలింగేశ్వరుడి కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. కోవెల పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 24 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.













