Raja Singh: ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేము :రాజాసింగ్
బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా (Resignation) చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మనసు మార్చుకున్నారు. పార్టీ నుంచి ఆహ్వానం అందితే తిరిగి చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒకరు గొడవ పడి బయటకు వెళితే, ఎప్పుడో అప్పుడు ఆ సోదరుడు ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపు నేను కూడా కుటుంబంలాంటి పార్టీలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేము అని వ్యాఖ్యానించారు. బీజేపీ (BJP)కి తాను నిజమైన సైనికుడినని, జాతీయ, రాష్ట్ర కీలక నేతలు పిలిచిన రోజు తిరిగి పార్టీలోకి వెళ్తానని అన్నారు. అసెంబ్లీలో స్వేచ్ఛ ఇవ్వాలని, ఎమ్మెల్యే, ఎంపీలు వారి నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఉన్నప్పుడే పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రాగలుగుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీ పెద్దల నుంచి తనకు తప్పకుండా పిలుపు వస్తుందని, తమకు స్వేచ్ఛ ఇస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో యుద్ధం చేస్తామన్నారు.






