ఖర్చు తన ఖాతాలో రాస్తారనే.. ఆ సభకు రాలేదు
ఎల్బీ స్టేడియం గోషామహల్ నియోజకవర్గంలో ఉండడంతో ఆ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినందున సభ ఖర్చునంతా తన ఖాతాలో రాసే అవకాశం ఉన్నందునే బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు కాలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఎల్బీస్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ ముఖ్య, కీలక నేతలంగా పాల్గొన్నారు. అయితే ఈ సభకు గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాలేదు. ఈ అంశం పార్టీ శ్రేణుల్లో విస్తృత చర్చకు దారితీయడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించి వివరణ ఇచ్చారు. బీజేపీ సభ జరిగిన ఎల్బీ స్టేడియం నా నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేశాను. కనుక ఆ సభలో నేను పాల్గొంటే ఆ సభ ఖర్చు అంతా నా ఖాతాలో రాసే అవకాశం ఉంది. ఈ అంశంపై పార్టీ నేతలు, కేంద్ర ఎన్నికల కమిషన్‌తో నేను మాట్లాడాను. వారు కూడా అదే చెప్పారు. మా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అదే వివరించారు. దాంతో నేనా సభకు హాజరు కాలేదు. కానీ, మా గురువు గారు నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో నేను పాల్గొన లేకపోవడం చాలా బాధగా ఉంది అని అన్నారు.













