మీకోసం పోరాటం చేసేది బీజేపీ మాత్రమే : రాజాసింగ్
పాతబస్తీ ప్రజలకు చెప్పేది ఒక్కటే మీకోసం పోరాటం చేసేది బీజేపీ మాత్రమే అని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతబస్తీకి మెట్రో రైలు లైన్ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్శించారు. మెట్రో లైన్ కోసం బీజేపీ దీక్ష చేస్తే పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు. బీజేపీ డిమాండ్‌లో ఏమైనా తప్పు ఉందా అని కేసీఆర్, కేటీఆర్‌ను ఈ సందర్భంగా ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా పాతబస్తీ ఎందుకు అభివృద్ధి జరగడం లేదు. మెట్రోను ఎందుకు తీసుకువెళ్లడం లేదని నిలదీశాం. అప్పుడు పాతబస్తీలోకి మెట్రోకి రూట్‌మ్యాప్ సిద్ధమైందని నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వెంటనే నిర్మాణం పనులు కూడా ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుంది. తప్పితే ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సైతం అసెంబ్లీలో మెట్రో కావాలని అడిగి, సీఎం ఛాంబర్‌కు వెళ్లి పాతబస్తీకి మెట్రో వద్దని అంటారు. పాతబస్తీ అభివృద్ధి చెందితే రాజకీయ భవిష్యత్ ఉండదనే భావనతోనే అక్కడ ఎలాంటి పనులు చేపట్టట్లేదు. పాతబస్తీ అభివృద్ధి చెందాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని అన్నారు.













