బీజేపీలో చేరితే అవినీతిపరులు కూడా పుణ్యాత్ములు అయిపోతారు: రాహుల్ గాంధీ సెటైర్లు!

బీజేపీ ఒక పెద్ద వాషింగ్ మెషీన్‌లా మారిందని, తప్పు చేసిన నేతలంతా బీజేపీలో చేరగానే పుణ్యాత్ములుగా మారిపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుందని, దేశంలోని అవినీతిపరులంతా మోదీతోనే ఉన్నారని ఆయనన్నారు. అలాగే ఎన్నికల సంఘంలోనూ మోదీ మనుషులున్నారని, ఎలక్టోరల్ బాండ్ల జాబితా చూస్తే ఏం జరిగిందో ప్రజలకే అర్థమవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఏర్పాటుచేసిన ‘కాంగ్రెస్ జన జాతర’ సభ వేదికగా ‘న్యాయ పత్రం’ పేరుతో కాంగ్రెస్ తమ జాతీయస్థాయి మేనిఫెస్టోను చేసింది. ఈ మేనిఫెస్టోను స్వయంగా విడుదల చేసిన రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ మాజీ సీఎం వేల ఫోన్లు ట్యాప్ చేయించారన్న రాహుల్.. రెవెన్యూ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను దుర్వినియోగం చేసి, ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా నదుల్లో పడేశారని ఆరోపించారు. బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అనంతరం బీజేపీని కూడా టార్గెట్ చేసిన రాహుల్.. తెలంగాణలో కేసీఆర్ చేసిందే కేంద్రంలో మోదీ చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకుని విపక్ష నేతలను జైళ్లలో పెడుతున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అనంతరం తమ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడలోనే గ్యారంటీ కార్డు విడుదల చేశామని, రూ.500 సిలిండర్, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు, గృహలక్ష్మి గ్యారంటీలు ఇచ్చి వాటిని అమలు కూడా చేస్తున్నామని రాహుల్ చెప్పుకొచ్చారు. సరిగ్గా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలానే ఇప్పుడు జాతీయ మేనిఫెస్టోలో కూడా 5 గ్యారంటీలు పొందుపరిచినట్లు వివరించారు. యువతకు ఏడాదికి రూ.లక్ష ఉపాధి హామీ, విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతోపాటు నెలకు రూ.8,500 స్టైఫండ్, మహిళా న్యాయం ద్వారా మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం, రైతులకు మద్దతు ధర-రుణ మాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు దేశ ప్రజలకు కూడా అందిస్తామని అన్నారు.