బంగారు తెలంగాణ కలగంటే….బంగారు కుటుంబం తయారైంది
నాలుగున్నరేళ్ల క్రితం తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ వస్తుందని కలగంటే.. బంగారు కటుంబం తయారైందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. గద్వాలలో నిర్వహించి ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ అస్తవ్యస్త నిర్ణయాలతో తెలంగాణ అప్పుల్లోకి కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్కు కొత్త పేరు వచ్చిందనీ అది ఖావో కమీషన్ రావు (కమీషన్లు తినే రావు) అని రాహుల్ ఎద్దేవా చేశారు. భూ హక్కుల కోసం యుపిఎ తెచ్చిన చట్టాలను బీజేపీ, టీఆర్ఎస్లు కలిసి నిర్వీర్యం చేశాయని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు కేవలం రూ.70,000 కోట్ల అప్పు మాత్రమే ఉండేదని, ఇప్పుడు మొత్తం అప్పు రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి కుటుంబంపై రూ.1.5 లక్షల అప్పు భారం పడిందని, అదే సమయంలో ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగిందని ఆరోపించారు. ఈ రోజు తెలంగాణలో 30 లక్షల మంది యువతకు ఉపాధి లేదన్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణలో ఎంతమంది యువతీ యువకులకు కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.













