తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల చివరి వారంలో ఆయన జిల్లాకు రానున్నారు. దీంతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సమావేశానికి కసరత్తు చేస్తున్నారు. పోలీసుల నుంచి కూడా సమావేశానికి అనుమతి తీసుకున్నారు. ఈ నెల 25, 26, 28 తేదీల్లో ఆర్ట్స్ కళాశాలలో సమావేశానికి అనుమతి పొందినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి పది వేల మందిని తరలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ జిల్లా నుంచి కార్యకర్తలను తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను త్వరలోనే నియమించనున్నట్లు సమాచారం. మండల, నియోజక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.













