సీఎం కేసీఆర్ ఫై ఫిర్యాదు చేస్తాం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారులు సిద్ధిపేటలో ప్రొటోకాల్ పాటించలేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయలేదు. మెడికల్ కళాశాలను దుబ్బాకలో కాకుండా సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు రింగురోడ్డు ఉంటుంది. దుబ్బాకకు ఉండదా? వెయ్యి రెండు పడక గదుల ఇళ్లు దుబ్బాకకు అదనంగా ఇవ్వాలి. దుబ్బాకపై వివక్ష చూపించడం బాధాకరం. సిద్దిపేట మాదిరిగా దుబ్బాకకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. దుబ్బాకకు కొత్త బస్టాండ్ మంజూరు చేయాలి.
సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం ఇస్తే దుబ్బాకకు ఒక బస్టాండ్ ఇవ్వరా? శంషాబాద్ విమానాశ్రయం నుంచి 155 కిలో మీటర్ల పరిధిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టొదని అగ్రిమెంట్ ఉంది. ఈ విషయం సీఎంకు తెలియదా? నాలుగేళ్ల క్రితం వరంగల్‌కు ఇచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందో సిద్దిపేటది కూడా అదే పరిస్థితి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిద్దిపేటలో వరాలు జల్లు కురిపించారు. ప్రొటోకాల్ పాటించని సీఎం కేసీఆర్, అధికారులపై ఫిర్యాదు చేస్తాం. కేంద్రం ఎక్కడా వివక్ష లేకుండా చూస్తుంటే, కేసీఆర్ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని రఘనందన్‌రావు ఆరోపించారు.













