తెలంగాణ బీజేపీలో రఘునందన్ ముసలం..!! పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమా..?
తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొన్న విషయం ఇటీవల చూస్తూనే ఉన్నాం. నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీని బజారున పడేశాయి. అయితే పైకి మాత్రం నేతలు ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకుంటున్నారు. కానీ అసమ్మతిని ఎంతో కాలం కప్పిపుచ్చలేం. ఇప్పుడిప్పుడే నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పార్టీలో జరుగుతున్న పరిణామాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతున్నాయి.
రఘునందన్ రావు కొంతకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. వాటిని బలపరిచేలా ఇవాళ రఘునందన్ రావు చేసిన కామెంట్స్ ఉన్నాయి. పార్టీకి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనని రఘునందన్ రావు కుండబద్దలు కొట్టారు. ఇంతకాలం నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని, పరస్పరం అధిష్టానానికి నేతలు ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన హైకమాండ్ సమూల మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిసింది. అందులో భాగంగానే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రఘునందన్ రావు ఇవన్నీ నిజమేనని తేల్చి చెప్పారు.
తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం లభించలేదని రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా తాను పార్టీకి సేవలందిస్తున్నానని చెప్పారు. దుబ్బాకలో తాను గెలిచిన తర్వాతే అందరూ పార్టీలోకి రావడం మొదలు పెట్టారని చెప్పుకొచ్చారు. తన కంటే ముందు బీజేపీ 3500 ఓట్లు మాత్రమే వచ్చాయని.. కానీ అక్కడ తన స్వశక్తిగా గెలిచి చూపించానని చెప్పారు రఘునందన్. ప్రజలు తరుణ్ చుగ్ ను చూసి ఓట్లు వేయరని.. ఈటలను, రఘునందన్ ను చూసి ఓట్లేస్తారని స్పష్టం చేశారు. మునుగోడులో వంద కోట్లు ఖర్చు చేసినా గెలవలేదని.. ఆ డబ్బు నాకు ఇచ్చింటే తెలంగాణ మొత్తం దున్నేసే వాడినని రఘునందన్ చెప్పారు.
ఢిల్లీలో రఘునందన్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనకు అధ్యక్ష పదవి కానీ, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా కానీ.. లేదంటే జాతీయ అధికార ప్రతినిధిగా కానీ నియమించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని ఇవ్వకపోతే తాను బయటకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగా ఉన్న విషయం నడ్డాకు కూడా తెలీదని.. ఆ విషయం చెప్తే.. అదేంటి అని తననే నన్ను ఎదురు ప్రశ్నించారని రఘునందన్ రావు చెప్పారు. ముఖ్యంగా రఘునందన్ రావు అక్కసు అంతా బండి సంజయ్ కేంద్రంగా ఉన్నట్టు అర్థమవుతోంది. తరుణ్ చుగ్ కూడా బండి సంజయ్ చెప్పినట్టు నడుచుకుంటున్నారని చెప్పారు. పుస్తెలమ్మి ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ కి ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చుకునేంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని రఘునందన్ రావు ప్రశ్నించారు. దీన్ని బట్టు చూస్తుంటే బండితో తాడోపేడో తేల్చుకునేందుకు రఘునందన్ రావు సిద్ధమైనట్టు తెలుస్తోంది.













