ఐఏసీపీ పురస్కారాల జాబితాలో రాచకొండ కమిషనర్ స్థానం
అమెరికాలోని ఒర్లాండోలో 2018 ఐఏసీపీ (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్) లీడర్షిప్ ఇన్ హ్యూమన్ అండ్ సివిల్ రైట్స్ ఇండివిడ్యువల్ అవార్డ్ పురస్కారాల్ని ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారాలకు ఎంపికైన పోలీస్ ఉన్నతాధికారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పురస్కారాల్ని అందించారు. ఆగస్టులో ఈ పురస్కారాల్ని ఎంపిక చేసిన జాబితాలో రాచకొండ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్‌కు స్థానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటం తోపాటు ఎన్నికల విధుల్లో తలమునకలై ఉండటంతో ఆయన కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. పురస్కారాన్ని పోస్టు ద్వారా పంపించనున్నట్లు అవార్డు కమిటీ సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.
ఒడిషా నుంచి వచ్చి రాచకొండ కమిషనరేట్ పరధిలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న 889 మంది బాలకార్మికులను ఇతర అధికారుల సహాయంతో ఆయన విముక్తి కల్పించారు. చిన్నారులు పని చేస్తున్న ప్రాంతంలోనే బడులు (వర్క్‌సైట్ స్కూల్స్) ప్రారంభించి ఒరియా భాషలోనే చదువులు చెప్పించారు. ఈ కృషికిగానూ ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల నుంచి పోలీసు ఉన్నతాధికారులను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.













