పీవీ విజ్ఞాన వేదిక ఖరారు …
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జ్ఞాపకార్థం కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో నిర్మించతల పెట్టిన పీవీ విజ్ఞాన వేదిక టూరిజం పార్కు నమూనాను శతజయంతి వేడుకల కమిటీ ఖారారు చేసింది. ఈ కమిటీ రవీంద్ర భారతిలో సమావేశమై పలు నమూనాలను పరిశీలించింది. వివిధ కన్సల్టెన్సీ సంస్థలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేదిక నమూనాలను కమిటీకి చూపించాయి. హైదరాబాద్‌కు చెందిన డీకే థాటి కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన నమూనాను కమిటీ ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ చూసిన తరువాత ఆయన సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఈ వేదిక నిర్మాణానికి రూ.8 నుంచి 9 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన జీవిత చరిత్ర వివరాలతో సహా పార్కులో అందుబాటులో ఉంచుతారు.
రెండో దశలో పీవీ జన్మించిన వరంగల్ రూరల్ జిల్లా లక్నేపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. పీవీ విజ్ఞాన వేదిక పార్కును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పీవీ విగ్రహాలను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని కమిటీ చైర్మన్ కె.కేశవరావు చెప్పారు. టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.













