విద్యాశాఖా మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం?
ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకం కానున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకరోల్ పోషించిన కోదండరాం, కేసీఆర్ హయాంలో కొంత ఇబ్బందులకు గురయ్యారు. రాజకీయంగా కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. పోటీకి దూరంగా ఉండి, ప్రచారంలో పాల్గొన్నారు. మేధావులను ఏకం చేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేశారు. ఈ క్రమంలో అప్పట్లో ఆయనకు ప్రస్తుత సీఎం రేవంత్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. దీనిని ఇటీవల సాకారం చేశారు. ఇప్పుడు మంత్రివర్గంలో కీలక స్థానాలు ఖాళీగా ఉండడంతో విద్యాశాఖకు ఆయనను మంత్రిని చేసే అవకాశం పరిశీలనలో ఉన్న మాట నిజమే. విద్యావేత్తగా, గురువుగా కోదండరాం ప్రఖ్యాతి చెందారు. పైగా మేధావి వర్గంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖను ఆయనకు అప్పగించడం ద్వారా అన్ని వర్గాల నుంచి మన్ననలు పొందే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భావించి ఉంటారు. అందుకే ఆయనను నేరుగా ఎమ్మెల్సీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై కసరత్తు చేస్తున్నారని, పార్టీ అధిష్ఠానం ఓకే చెబితే కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది.













