బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే.. వారి ఆకాంక్షలు నెరవేరేవి : ప్రియాంక గాంధీ
తెలంగాణ సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారని, బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే వారి ఆకాంక్షలు నెరవేరేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మధిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక మాట్లాడుతూ కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ప్రజల బాధలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ సంపదను పంచుకోవడంలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామన్న హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదు. రైతులకు రుణామఫీ చేస్తామన్న కేసీఆర్ హామీ నెరవేరలేదు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులు సతమతవుతున్నారు.
దేశంలో ప్రజలే నాయకులు. ప్రజలకంటే అతీతులం అన్నట్టు మోదీ, కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? మీరంతా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులంతా మంత్రులయ్యారు. బీఆర్ఎస్ నేతలందరికీ వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. భట్టి విక్రమార్క్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా ససమ్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భట్టిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.













