తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజాగ్రహం…
కరోనా వ్యాధిని అడ్డుపెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా హైదరాబాద్, జంటనగరాల పరిధిలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల నుంచి రోజుకి ఇంతని ప్యాకేజీలు నిర్ణయించి రూ.8లక్షలు మొదలుకుని ఎడా పెడా బిల్లులు వసూలు చేస్తున్నారని ఒక్కోసారి రూ.20, 25లక్షల బిల్లులు అయిన ఉదంతాలు కూడా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఆదివారం రాష్ట్ర మంత్రి కెటియార్ ట్విట్టర్ కు నెటిజన్లు ఫిర్యాదుల పరంపర పంపారు.
కరోనా వ్యాధి పాజిటివ్ అని తేలితే ప్రైవేటు ఆసుపత్రులు వారు రోజుకి రూ.లక్ష ఫీజు వసూలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తే, ప్రభుత్వ ఉద్యోగులను చేర్చుకోమంటున్నారని, అలాగే ఇన్సూరెన్స్ ఉందని చెప్పినా కూడా చేర్చుకోమని పంపేస్తున్నారని మరికొందరు ఆరోపించారు. ఇలా పలువురి నుంచి ఆరోపణలు వస్తుండడంతో కెటియార్ స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులూ ఉన్నాయన్నారు. రోగులు ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని సూచించారు.
ఇదిలా ఉంటే ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకంపై ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చమని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఉలుకూ పలుకూ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై భాజాపా, కాంగ్రెస్ పార్టీల నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నల పరంపరతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మరోవైపు తాము కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇప్పటికే డెక్కన్, విరించి వంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు విమర్శల పర్వాన్ని ఆపలేకపోతున్నాయి. ఒకటో రెండో రాజకీయ పలుకుబడి లేని ఆసుపత్రుల మీద మాత్రమే నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బలమైన కార్పొరేట్ ఆసుపత్రుల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.













