మల్కాజిగిరి లో ప్రధాని మోదీ రోడ్ షో

హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ప్రాంతం కమల నినాదంతో మారుమోగింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోకు నగర ప్రజలు, అభిమానులు పోటెత్తారు. ప్రదర్వన పొడవునా ప్రధానికి బ్రహ్మరథం పట్టారు. జనసమూహాన్ని చూసిన మోదీ రెట్టించిన ఉత్సాహంతో రెండు చేతులు ఊపుతూ ముందుకు సాగారు. కిలోమీటరున్నర పొడవుగా జరిగిన ఈ ప్రదర్శనకు భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు, ప్రజలపై మోదీపై పూలవర్షం కురిపించారు. మోదీ మోదీ మళ్లీ మీరే ప్రధాని అంటూ పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు నినాదాలు చేస్తూండగా, మల్కాజిగిరి నియోజకవర్గంలోని మిర్జాలగూడ నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభమైంది. ప్రచారరథంపై ప్రధానికి కుడివైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎడమవైపు మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. మోదీకి బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు. అడుగడుగునా కార్యకర్తలు, ప్రజలు నినాదాలు చేస్తుండగా, ప్రచారరథం ముందుకు సాగింది. అభిమానులు కోలాటాలు, డీజేపీ డప్పులతో రోడ్‌షోను మారుమోగంచారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ఎదురుచూస్తున్న అభిమానులను పలకరిస్తూ రెండు చేతులూ ఊపుతూ అభివాదం చేస్తూ మోదీ ముందుకు కదిలారు.