93 మంది సమరయోధులను సత్కరించిన కోవింద్
సన్మాన గ్రహీతల్లో తెలంగాణవారు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం రాష్ట్రపతి భవన్లో తొలిసారిగా ‘ఎట్ హోం’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 93 మంది స్వాతంత్య్ర సమరయోధులను ఆయన సత్కరించారు. క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో సమరయోధులకు కోవింద్ ఎలక్ట్రిక్ తేనీటి పాత్ర(కెటిల్)లను బహుమానంగా ఇచ్చారు. వ్యక్తిగత సందేశం కూడా అందించారు. సన్మానం పొందిన తెలంగాణ సమరయోధుల్లో బి.శ్రీనివాస్, కె.కొమరయ్య, బి.మురహరి, వేములపల్లి నారాయణ(వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు), రామలింగయ్య, రామానుజం, ఎర్రబెల్లి రంగారావు(కరీంనగర్ జిల్లా), బాల పాపిరెడ్డి(జనగామ జిల్లా), కిషన్‌రావు (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) ఉన్నారు.
క్విట్ ఇండియా పోరాటంలో పాల్గొన్న దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్నాయని, సన్మానం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. దేశం కోసం పోరాడినందుకు గొప్ప గౌరవం దక్కిందన్నారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవం సందర్భంగా ఎనిమిది స్మారక తపాలా బిళ్లలను రాష్ట్రపతి విడుదల చేశారు.













