తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర గవర్నర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చే జాతీయ లక్ష్యాన్ని తెలంగాణ సాధించిందని రాంనాథ్ ప్రశంసించారు.
ఉప రాష్ట్రపతి :వెంకయ్య నాయుడు
ట్విట్టర్ వేదికగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఘన చరిత్ర, విశిష్ఠ సంస్కృతులకు నిలయం తెలంగాణ అని కొనియాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో ఘననీయమైన ప్రగతి, స్వయం సమృద్ధి సాధిస్తూ… దేశాభివృద్ధిలో తనవంతు పాత్ర కొనసాగించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
ప్రధాని నరేంద్ర మోదీ
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశిష్ట సంస్కృతికి నిలయమని, కష్టపడి పనిచేసే తత్వమున్న తెలంగాణ ప్రజలు అనేక రంగాలలో రాణించారని ప్రశంసించారు. తెలంగాణ ప్రజానీకానికి ఆయురారోగ్యాతో సిరి సంపదలతో తులతూగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.