వైభవంగా ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం
తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాణహిత నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట పుష్కరఘాట్ వద్ద తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాణహితకు కలశపూజ, గణపతి పూజ, హారతి, విశేషపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. 12 రోజుల కార్యక్రమం కావడంతో శాశ్వత ఏర్పాట్లు చేయలేదని వివరించారు. కృష్ణ, గోదావరి, ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొనే అదృష్టం దక్కిందన్నారు.
నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రానికి సమీపంలో ప్రాణహిత పుష్కరాలకు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో రోజూ 2 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని అంచనా.













