సీఎం కేసీఆర్ తో పాటు అసెంబ్లీకి వెళ్లిన ప్రకాశ్ రాజ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ కలిశారు. ఈ రోజు ముఖ్యమంత్రితో కలిసి అసెంబ్లీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమచారం. బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ సమాయత్తమవుతున్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కేసీఆర్ కోల్‌కతాకు వెళ్లి బంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. మరిన్ని రాజకీయ పక్షాలతోనూ సంప్రందింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యోదంతం తర్వాత ప్రకాశ్ రాజ్ రాజకీయ అంశాలపై తరచూ స్పందిస్తున్నారు. దేశంలోని వివిధ కీలక అంశాలపై తనదైన వాణిని విన్పిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను ఆయన కలవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













