రాజ్యసభకు ప్రకాశ్ రాజ్ ?
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడి బండి ప్రకాశ్ తన పదవికీ రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. జూన్‌లో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, శ్రీనివాస్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ మూడు ఖాళీలకు ఒకేసారి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఖాళీల్లో ఒక సీటు ప్రకాశ్ రాజ్‌కు కేటాయించి టీఆర్ఎస్ తరపున ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యతలు కూడా ప్రకాశ్ రాజ్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ప్రకాశ్ రాజ్ సడన్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన రోల్‌పై టీఆర్ఎస్ ఊహాగానాలు జోరందుకున్నాయి.













