కూల్చుతామని మీరంటుంటే… నిలబెట్టడానికి వారు వస్తున్నారు : మంత్రి పొన్నం

భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన మన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ జిల్లాల్లో 43 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ అలవాటు అందరి జీవితంలో భాగం కావాలని కోరారు. ప్రభుత్వం మొక్కలు పంపిణీ చేస్తోంది. ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి. కాలుష్యం తగ్గి వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే అందరూ దీనిపై దృష్టి సారించాలి. ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలి. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు.
బీజేపీ ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. డిసెంబర్ 3 వరకు ఇతర, పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే ఆలోచనే లేదు. ప్రభుత్వాన్ని కూల్చుతామని మీరంటుంటే, నిలబెట్టడానికి వారు వస్తున్నారు. మేం ధర్మం తప్పలేదు, ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు. కులగణనపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం అని పొన్నం తెలిపారు.