పొన్నాలకు లైన్ క్లియర్ ….
మహాకూటమి లో జనగామ టికెట్ కేటాయింపుపై పొన్నాలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కేటాయిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ టికెట్ ను పొత్తులో భాగంగా తెలంగాణ జనసమితికి కేటాయిస్తారని అందరూ భావించారు. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైతం తొలి రెండు జాబితాల్లో జనగామ టికెట్ ను ఎవ్వరికీ ప్రకటించలేదు. దీంతో ఢిల్లీకి వెళ్లిన పొన్నాల హైకమాండ్‌తో చర్చలు జరిపారు. గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి జనగామను కంచుకోటగా మార్చాననీ, తనను తప్పించి బీసీలకు తప్పుడు సందేశం పంపవద్దని సూచించినట్లు సమాచారం. రేపు కాంగ్రెస్ పార్టీ తమ చివరి జాబితాను ప్రకటించనుంది. ప్రసుత్తం ఢిల్లీలోనే ఉన్న పొన్నాల టికెట్ దక్కిన సంతోషంలో ఈ రోజు హైదరాబాద్‌కు రానున్నారు.













