ఈ ప్రాజెక్టు కట్టింది ప్రజల కోసమా?… లేక మీ దోపిడీ కోసమా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దోపిడి అంటే కల్వకుంట్ల, ప్రజా వ్యతిరేకం అంటే కల్వకుంట్ల అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేసీఆర్ అవలంబించిన విధానాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సాంకేతిక నిపుణులతో చర్చించకుండానే ప్రాజెక్టును చేపట్టారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిపుణుల సలహాలు, సూచనలు, మార్పులు, చేర్పులకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్కు అసలు నీళ్లు వస్తాయా? అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కట్టింది ప్రజల కోసమా? లేక మీ దోపిడీ కోసమా? అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మైదాన ప్రాంతాల్లో ఇంత పెద్ద రిజర్వాయర్ ఉందా? అన్నారు. ఎత్తిపోతల పథకాలకు రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండాలన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో అలా జరగలేదన్నారు. ప్రమాదం వస్తే లక్షలాది మంది కొట్టుకుపోతారనే విషయం తెలియదా? కొమురవెల్లి మల్లన్న పాదాలు కడిగితే పుణ్యం వస్తుందా? మసిబూసి మారేడుకాయ చేయడమే సీఎం కేసీఆర్ విధానం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.













