భూదాన్ పోచంపల్లికి అరుదైన గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి అరుదైన గౌరవం లభించింది. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లిని ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక చేసింది. డిసెంబరు 2వ తేదీన స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. భూదాన ఉద్యమంతో ఈ గ్రామం భూదాన్ పోచంపల్లిగా ప్రసిద్ధి చెందింది. ఇదిలా ఉంటే, ఉత్తమ పర్యాటక గ్రామం కేటగిరి కింద భారత్ నుంచి మూడు గ్రామలు ఎంపికయ్యాయి. తెలంగాణలోని పోచంపల్లితో పాటు మధ్యప్రదేశ్లోని లాధ్పురా ఖాస్, మేఘాలయాలోని కోంగ్తాంగ్ గ్రామాలు నామినేట్ అయ్యాయి. వీటిని పరిశీలించిన ఐరాస పర్యాటక సంస్థ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది.సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పోచంపల్లి పేరు సంపాదించింది. పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.













