పోచంపల్లి ఇక్కత్ చీరకు మరో అరుదైన గౌరవం
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి ఇక్కత్ చీరకు మరో అరుదైన గౌరవం దక్కింది. అయోధ్య రామ మందిరంలో సీతారాములకు పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలను బహుకరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సనత్‌నగర్‌లోని హనుమాన్ మందిరంలో భూదాన్‌పోచంపల్లికి చెందిన మద్దెలమ్మదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేనేత కళాకారులు మగ్గంపై పట్టు వస్త్రాలను నేయడం ప్రారంభించారు. వీటి తయారీ మరో మూడు రోజుల్లో పూర్తవుతుందని, 29న అయోధ్యకు తీసుకువెళ్లి ఆలయంలో అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. వస్త్రాల తయారీ ప్రక్రియలో పోచంపల్లి చేనేత కళాకారులు చంద్రశేఖర్, చెన్నకేశవులు, ఆంజనేయులు, గిరివాసు, యాదగిరి పాల్గొన్నారు. వీరికి సికింద్రాబాద్ గణపతి దేవాలయ కమిటీ సభ్యులు సహకారం అందించారు.













