ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలి: ప్రధాని
దేశంలో డిజిటల్ అగ్రికల్చర్ లక్ష్యంతో ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పటాన్చేరులోని ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ వచ్చే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యంగా నిర్దేశించుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆకాంక్షించారు. వాతావరణ మార్పులకు తట్టుకునే సరికొత్త వంగడాలను సృష్టించాలన్నారు. పంటకాలం తక్కువ ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పంట దిగుబడి గణనీయంగా ఉందని, చిన్న రైతుల సాగు వ్యయాన్ని తగ్గించాలని అన్నారు.
దేశంలో 80 శాతం కంటే ఎక్కువ చిన్న రైతులపై మా దృష్టి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ 2022`23 సహజ వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై దృష్టి పెట్టిందన్నారు. రాబోయే కొన్నేళల్లో పామాయిల్ రంగంలో ఏరియా వినియోగాన్ని 6.5 లక్షల హెక్టార్లకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అని వెల్లడిరచారు. ఆహార భద్రతలో పాటు పోషకాహార భద్రతపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తాము గత 7 సంవత్సరాల్లో అనేక బయో ఫోర్టిఫైడ్ రకాలను అభివృద్ధి చేశామని తెలిపారు. పామ్ ఆయిల్ ఉత్పత్తిలో ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉందని తెలిపారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు ఆశావహంగా ఉందన్నారు. పామాయిల్ సాగుతో ఏపీ, తెలంగాణకు అనేక ప్రయోజనాలున్నాయని అన్నారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఆహార భద్రతో పాటు పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బయో వ్యూయెల్తో రైతులకు సాగు ఖర్చు తగ్గుతుందని తెలిపారు. పరిశోధనలు, ఆవిష్కరణలు రైతుల సమస్యలను తీర్చాలని అంతిమంగా అందరి లక్ష్యం, వ్యవసాయాభివృద్ధేనని అన్నారు.













