కేంద్రం వరాలు..
పసుపుబోర్డు ఏర్పాటు..
ఎన్నికల వేళ తెలంగాణపై కేంద్రం వరాలు కురిపించింది. ముఖ్యంగా ఇందూరు పసుపురైతులు దశాబ్దాల కల సాకారం చేస్తూ .. జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నోటిఫికేషన్ జారీ చేసింది. పసుపు ఎగుమతులు ప్రస్తుతం రూ.1,600 కోట్లు కాగా దానిని 2030 నాటికి ఏటా రూ.8,400 కోట్లు పెంచడం లక్ష్యంగా ఈ పంటపై ప్రత్యేక దృష్టి సారించడానికి బోర్డు ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ పసుపు బోర్డు సహా కీలకాంశాలకు ఆమోదం తెలిపింది.
తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మిజోరం, గుజరాత్, అస్సాం, ఒడిశా, పశ్చిమబెంగాల్ రైతులకూ దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. పసుపు బోర్డు ఛైర్పర్సన్ను కేంద్రం నియమిస్తుంది. కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల, ఔషధ-ఆయుష్ శాఖలతో పాటు పసుపు పండించే రాష్ట్రాల నుంచి వంతులవారీగా సీనియర్ ప్రతినిధులు, పసుపు రైతులు, ఎగుమతిదారులు, పసుపు పరిశోధన సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పసుపు బోర్డుకు కేంద్ర వాణిజ్య శాఖ నుంచి కార్యదర్శిని నియమించనున్నారు. ప్రపంచ పసుపు వాణిజ్యంలో మన దేశానికి 62% వాటా ఉంది.
రూ.889 కోట్లతో విశ్వవిద్యాలయం
రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా వన దేవతలైన సమ్మక్క-సారక్క పేరుతో ములుగులో రూ.889 కోట్లతో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న కేంద్ర విశ్వ విద్యాలయాల చట్టం-2009ను సవరించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను ఎక్కువమందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ వర్సిటీ దోహదపడుతుందని కేంద్రం తెలిపింది. దీంతో గిరిజన యువతకు మేలు చేకూరనుంది.
కృష్ణా జలాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను ‘కృష్ణా నదీజలాల ట్రైబ్యునల్-2’కు అప్పగిస్తూ విధివిధానాలను కేబినెట్ ఖరారు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేలా ప్రస్తుతం ఉన్న కేడబ్ల్యూడీటీ-2కే సవరించిన విధివిధానాలు ప్రతిపాదించాలని కేబినెట్లో నిర్ణయించింది. దీనికి గడువు ఎంత అనేది వెల్లడించలేదు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను ట్రైబ్యునల్ చేస్తుందని ఠాకుర్ చెప్పారు.













