ఐఎస్బీ హైదరాబాద్ 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్ మరో మైలురాయిని అందుకుందని, దేశానికే గర్వకారణంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్బీ నుంచి ఇప్పటి వరకు 50 వేల మంది బయటకు వెళ్లారని, ఇక్కడి విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక స్టార్టప్‌లు రూపొందించారని తెలిపారు. ఐఎస్బీ విద్యార్థులు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 25 ఏళ్ల నాటి సంకల్పంలో ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరి ముఖ్య పాత్ర ఉందని అన్నారు. జీ 20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా ఉందన్నారు. స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో ఉంది. అంతర్జాల వినియగదారుల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. స్టార్టప్స్ రూపకల్పన, వినియోగదారుల మార్కెట్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోందన్నారు.
కరోనా విపత్తు వేళ భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. కొవిడ్ కారణంగా గొలుసు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధిలో భారత్ పురోభివృద్ధి సాధిస్తోంది. గత ఏడాది భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నారు. ఈ ఘనతలన్నీ ప్రభుత్వ ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. భారత్ సాధించిన ఘనతలో ఐఎస్బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఎంతో ఉందన్నారు. భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ప్రపంచ వ్యాప్త సమస్యలకు పరిష్కార మార్గాలు భారత్‌లో లభిస్తున్నాయి. యువత దేశాన్ని ఏలే విధంగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. విద్యార్థులు బయటకు వచ్చాక పాలసీ విధానాలు రూపొందిస్తారు. పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకు మాత్రమే పరిమితం కావొద్దు. రూపొందించిన విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత ఉంటుంది. దేశంలో సంస్కరణల అవసరం ఎప్పుడూ ఉంటుంది. 3 దశాబ్దాలుగా రాజకీయ అస్థిరతతో సంస్కరణల అమలు కష్టమైంది. 2024 తర్వాత భారత్‌లో సంస్కరణలు వేగవంతం అయ్యాయి అని మోదీ పేర్కొన్నారు.













