ఇక హైదరాబాద్ కు పైప్ ద్వారా గ్యాస్..!
హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. దేశంలోని మెట్రో నగరాలతోనే కాదు.. ప్రపంచంలోని పేరొందిన నగరాలతో కూడా పోటీ పడుతోంది. అయితే ఇప్పటికీ నగరంలో కొన్ని మౌలిక సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని తీరుతున్నాయి. ఒకప్పుడు ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ కు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా చెక్ పడింది. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం అవసరాలకు తగ్గట్లు లేకపోవడంతో శంషాబాద్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి మణిహారం హైదరాబాద్ కు మరొకటి రాబోతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ కు గ్యాస్ రావాలంటే సిలిండర్లే గతి. తీరప్రాంతాల నుంచి గ్యాస్ ను హైదరాబాద్ శివారులోని ఫిల్లింగ్ స్టేషన్లకు తీసుకొచ్చి అక్కడ సిలిండర్లకు నింపి సరఫరా చేస్తున్నారు. కొన్ని కంపెనీలు తీరప్రాంతాల్లోనే సిలిండర్లలో నింపి వాటినే నేరుగా నగరానికి తీసుకొస్తున్నారు. అయితే ఈ రవాణా చమురు కంపెనీలకు తీవ్ర భారమవుతోంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు, వినియోగదారులకు వేగంగా గ్యాస్ ను సరఫరా చేసేందుకు కంపెనీలు ఎప్పటి నుంచే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఓ అడుగు ముందుకు పడుతోంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హైదరాబాద్ కు గ్యాస్ పైప్ లైన్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకూ 442 కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్ ఉంటుంది. కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకూ గ్యాస్ ను ఈ పైప్ లైన్ ద్వారా తీసుకురానున్నారు. దీని ద్వారా ఖర్చు భారీగా తగ్గనుంది. ప్రస్తుతం కృష్ణపట్నంలో BPCLకు నిల్వకేంద్రం రెడీ అవుతోంది. దీని సామర్థ్యం 16.2లక్షల టన్నులు. అయితే బీపీసీఎల్ ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో 24 లక్షల టన్నుల పెట్రో ఉత్పత్తులను విక్రయిస్తోంది. అయితే కృష్ణపట్నం నిల్వ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారుల అవసరాలు తీర్చవచ్చని బీపీసీఎల్ భావిస్తోంది.
హైదరాబాద్ లో ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే కొన్ని గేటెడ్ కమ్యూనిటీలలో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే అందుకు తగ్గట్లు గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థలు ఆ ఏర్పాట్లు చేయగలిగితే అప్పుడు అది సాకారమవుతుంది. ఇప్పుడు బీపీసీఎల్ పైప్ లైన్ ద్వారా హైదరాబాద్ కు గ్యాస్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయడంతో భవిష్యత్తులో ఇది ఆచరణలోకి రావడం తథ్యంగా కనిపిస్తోంది.













